Seven Wonders In Vizag – Sakshi


ఏడు ప్రపంచ వింతలు.. వీటిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఒక్కో దిక్కున ఉన్న వీటిని చూసేందుకు చాలా సమయం పడుతుంది. రెక్కలు కట్టుకుని చుట్టుకు రావాలనే కోరిక ఆర్థిక స్తోమత లేక కాళ్లకు బంధాలు వేస్తుంది. ఈ వింతలన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందా? ఇది అసాధ్యమని మాత్రం అనుకోవద్దు. మన వైజాగ్‌లోనే ఉంటూ ఈ వింతలన్నింటినీ ఒకేసారి చూసి ఎంజాయ్‌ చేసే అవకాశం త్వరలోనే మీ ముందుకు రానుంది. ఏడు వింతలను ప్రతి సృష్టి చేసి.. సరికొత్త అనుభూతిని అందించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఏడు వింతల పార్కే కాదు.. విభిన్న రకాల థీమ్‌ పార్కులకు శ్రీకారం చుడుతోంది. – సాక్షి, విశాఖపట్నం 

కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న పుడమి తల్లికి పచ్చల హారాన్ని అలంకరించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నగరవాసులకు ఒత్తిడి దూరం చేసి.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు మేరకు విశాఖ నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మియావాకీ తరహా చిట్టడవుల పెంపకాన్ని ప్రారంభించిన జీవీఎంసీ.. తాజాగా పంచతత్వ పార్కులు, థీమ్‌ పార్కులు, స్వింగ్‌ గార్డెన్స్, నక్షత్ర వనాలు.. ఇలా విభిన్న పార్కులను అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 9.88 ఎకరాల్లో రూ.10.92 కోట్లతో తొలివిడతలో 11 పార్కులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది.  


తొలి విడతలో 9 థీమ్‌ పార్కులు… 
ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ ఆలోచన చేసింది. ఇందుకోసం ఆయా జోన్లలో ఉన్న జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి.. సీఎం ఆలోచనల మేరకు ఆ స్థలాల్లో థీమ్‌ పార్కులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.  
వివిధ దేశాల్లో ఉన్న ఏడు వింతలను ఎంచక్కా.. సిటీలోనే సరదాగా ఎంజాయ్‌ చేసేలా సెవన్‌ వండర్స్‌ పార్క్‌ రానుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ స్థాయిలో థీమ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా మినియేచర్స్‌తో సెవన్‌ వండర్స్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వండర్‌ను 22 నుంచి 30 అడుగుల ఎత్తు ఉండేలా ఆవిష్కరించనున్నారు. అన్ని వింతలూ రాత్రి పూట విద్యుత్‌ కాంతుల్లో ధగధగలాడేలా ఈ పార్కు రూపుదిద్దుకోనుంది.  
వర్షపు నీటిని ఎన్ని రకాలుగా భూమిలోకి ఇంకించవచ్చు అనే అంశం వివరిస్తూ.. రెయిన్‌ వాటర్‌ హార్వెస్ట్‌ పార్కు రానుంది. ప్రజలకు నీటి విలువను తెలియజెప్పడం, భూగర్భ జలాలు పెంపొందించుకోవడంపై అవగాహనతో పాటు పిల్లలు ఆడుకునేలా పచ్చదనంతో ఈ పార్కు కళకళలాడనుంది.  
పార్కులో బెంచ్‌లు కాకుండా వివిధ రకాల ఫ్రూట్‌ షేప్‌లు ఏర్పాటు చేసి వాటిపై సేదతీరేలా ఫ్రూట్‌ థండర్‌ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, డాగ్‌ పార్కు, లేక్‌ పార్కు… ఇలా విభిన్న థీమ్‌ పార్కులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార మొదలైన ప్రాంతాల్లో ఉన్న పెద్ద పార్కుల్లో కొన్నింటిని, మిగిలిన పార్కుల కోసం ఇప్పటికే గుర్తించిన ఖాళీ స్థలాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.  

ఆరోగ్యాన్ని పంచే పంచతత్వ వాక్‌వేలు 
ఉరుకుల పరుగుల జీవితంలో అలిసిపోతున్న నగరవాసుల ఒత్తిడి దూరం చేసేలా నగరంలో ఆస్ట్రో గార్డెన్‌తో కూడిన పంచతత్వ వాక్‌వేలను ఏర్పాటు చేయనుంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలినిచ్చేలా ఈ పంచతత్వ పార్కులు వేదికగా మారనున్నాయి. ఆరోగ్యకరమైన గాలికి చిరునామాగా.. మందులు లేకుండానే రక్తపోటు, కీళ్ల నొప్పులు మొదలైన వ్యాధులను దూరం చేసే ఆస్పత్రుల్లా… ఒత్తిడి మటుమాయం చేసే ధ్యాన కేంద్రంలా ఆస్ట్రో గార్డెన్‌తో కూడిన పంచతత్వ వాక్‌వే పార్కులు ఉపయోగపడనున్నాయి. ఈ తరహా పార్కులను జీవీఎంసీ పరిధిలో మొత్తం 6 ఏర్పాటు చేయనున్నారు. నక్షత్ర, రాశివనాల కలయికతో ఆస్ట్రోగార్డెన్స్‌తో పాటు పంచతత్వ వాక్‌వేలు ఈ పార్కుల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 
ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన 27 రకాల మొక్కలను ఓ చోట చేర్చితే నక్షత్రవనంగా మారుతుంది. అదేవిధంగా రాశులకు అనుగుణంగా 12 రకాల చెట్లను పెంచనున్నారు. 
పంచతత్వ వాక్‌వే పార్కు ఎనిమిది భాగాలుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర భాగాలు నీటితో నిండి ఉంటాయి. మిగిలిన భాగాల్లో నల్లమట్టి, ఇసుక, 6ఎంఎం మెటల్‌ చిప్స్, సాగర్‌రాయి, 12ఎంఎం చిప్స్, 20 ఎంఎం గుండ్రని చిప్స్‌తో నింపుతారు. 
రెండో వరసలో చక్కెర మొక్క, సదాపాకు, నిమ్మగడ్డి, తమలపాకు, దవనం, తులసి, కలబంద, సరస్వతి, రణపాల మొదలైన మూలిక, వైద్య మొక్కలు ఏర్పాటు చేస్తారు. 
మూడో వరసలో ఆక్యుపంక్చర్‌ అంటే సిమెంట్, కాంక్రీట్‌తో కూడిన 6 ఎంఎం మెటల్‌ చిప్స్‌తో ఉంటాయి. 
నాలుగో వరసలో పునాది రాయితో కూడిన గడ్డి ఉంటుంది.  
ఐదో వరసలో ఎనిమిది బాక్స్‌ల్లో మూలిక, ఔషధ మొక్కలుంటాయి. 
ఆరో వరసలో నక్షత్రవనం, రాశివనాలుంటాయి. 
ప్రతి జోన్‌లో ఒక పార్కు ఉండేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ క్రికెట్‌ స్టేడియం ఎదురుగా, హెచ్‌బీ కాలనీలోని ఆదర్శనగర్‌ పార్కులో, బుచ్చిరాజుపాలెం, షిప్‌యార్డు కాలనీ, అగనంపూడిలోని జనచైతన్య లే అవుట్, కూర్మన్నపాలెంలోని రాజీవ్‌నగర్‌తో పాటు భీమిలి, అనకాపల్లిలో మొత్తం 8 పార్కులు ఏర్పాటు చేయనున్నారు. 
పంచతత్వ వాక్‌వేతో నిద్రలేమి సమస్య తీర్చుట, కంటి చూపు, నరాల బలహీనత మెరుగుపడుతుంది. రుతు సమస్య, హోర్మన్ల సమస్య తీరుతుంది. హృదయనాళ కార్యకలాపాలను మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. పంచతత్వ పార్కులో నడవడం వల్ల ఆక్యుపంక్చర్‌ వైద్యంగా ఉపయోగపడుతుంది. 

వినూత్న కాన్సెప్ట్‌లు సిద్ధం 
విశాఖ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జీవీఎంసీ వినూత్న కాన్సెప్ట్‌లను సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వందలాది ఖాళీ స్థలాలను గుర్తించాం. వాటిని వివిధ రకాల పార్కుల కోసం వినియోగించాలని నిర్ణయించాం. ఏపీ అర్బన్‌ గ్రీన్‌ కార్పొరేషన్‌ సహకారంతో 5 శాతం ఎస్టిమేట్‌ కాస్ట్‌తో ఫీజ్‌ తీసుకునే ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ డ్రాయింగ్‌ మొత్తం వారి ద్వారా జరిగేలా నిబంధనలు పాటిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా థీమ్‌తో పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తయితే నగర వాసులకు పంచతత్వ పార్కులు పంచప్రాణాలుగా నిలుస్తాయి. ఆక్యుపంచర్‌ వైద్యం అందించే వైద్యశాలలుగా పార్కులు మారనున్నాయి. మొత్తంగా విశాఖనగరాన్ని సిటీ ఆఫ్‌ పార్క్స్‌గా తీర్చిదిద్దుతాం. 
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌  Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Now ButtonCall now for Cab